ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నేత శశి థరూర్. కోవిడ్ సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ దేశాలతో టీకా దౌత్యాన్ని నిర్వహించిన తీరును ఆయన మెచ్చుకున్నారు. ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాలను ప్రశసించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలతో ఇతర సీనియర్ నేతలతో శశి థరూర్ మధ్య దూరం ఏర్పడింది. శశిథరూర్ బీజేపీలో చేరుతారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే కేవలం విదేశీ విధానాలను మెచ్చుకుంటున్నానని, తానేమీ పార్టీ మారడం లేదని థరూర్ ఇటీవల స్పష్టం చేశారు.

అంతర్జాతీయ నాయకత్వానికి ఇదో శక్తివంతమైన ఉదాహరణ
తాజాగా ద వీక్ మ్యాగ్జిన్‌లో రాసిన ఓ కథనంలో ఎంపీ థరూర్.. కోవిడ్ మహమ్మారి వేళ కేంద్ర సర్కారు చేపట్టిన వ్యాక్సిన్ డిప్లమసీని మెచ్చుకున్నారు. అంతర్జాతీయ నాయకత్వానికి ఇదో శక్తివంతమైన ఉదాహరణ అని ఆ కథనంలో రాశారు. చాలా బాధ్యతాయుతంగా, ఎంతో సంఘీభావంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొనియాడారు. కరోనా వల్ల లాక్‌డౌన్ పరిస్థితి ఏర్పడి అయిదేళ్ల అయిన సందర్భంగా ఆయన ఈ కథనాన్ని రాశారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య దౌత్యంలో భారత ఓ కీలకమైన దేశంగా ఎదిగిందన్నారు. సుమారు వందకుపైగా దేశాలకు రెండు అతిప్రధానమైన కోవిడ్ టీకాలను భారత్ సరఫరా చేసినట్లు తన కథనంలో పేర్కొన్నారు.
వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని..
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు సుమారు వందకుపైగా దేశాలకు వెళ్లాయని, అత్యవసరమైన సమయంలో చేయూతను అందించి ఇండియా తన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. వసుదైక కుటుంబం అన్న భావాన్ని భారత్ వినిపించిందన్నారు. ఉప ఖండంలోని ఇతర దేశాలతోనూ సఖ్యతగా వ్యవహరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇండియా ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని కోవాక్స్ ప్రోగ్రామ్‌కు ఇండియా సహకారం అందించడాన్ని కాంగ్రెస్ నేత ప్రశంసించారు.