ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. తల్లికి వందనం పథకాన్ని మే నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తల్లికి వందనం పథకం నిబంధనలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో బడికి వెళ్లే ఐదుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళా సాధికారత
మరోవైపు గతంలో తానే కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పానన్న చంద్రబాబు.. ప్రస్తుత అవసరాల దృష్ట్యా జనాభాను పెంచాలని తానే చెప్తున్నానని అన్నారు. మహిళా ఉద్యోగులకు ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు చంద్రబాబు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని..మహిళలకు ఆస్తిలో హక్కును ఎన్టీఆర్ తొలిసారిగా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యా, ఉద్యోగాల్లో తొలిసారిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామనీ.. మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. డీలిమిటేషన్ జరిగితే ఏపీ అసెంబ్లీలోకి సుమారు 75 మంది మహిళలు వస్తారని చంద్రబాబు తెలిపారు. మహిళల కోసం పసుపు, కుంకుమ, దీపం పథకం, డ్వాక్రా సంఘాలు వంటి కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. ఇక ఏపీ రాజధాని అమరావతి బతికి ఉందంటే అందుకు కారణం మహిళలు చూపించిన చొరవేనని చంద్రబాబు కొనియాడారు.