రంజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్ నగరం ప్రత్యేకమైన సందడిని సంతరించుకుంటుంది. పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతం ముఖ్యంగా రంజాన్ సమయంలో వాణిజ్యానికి హబ్‌గా మారుతుంది. బిర్యానీ, ఇరానీ చాయ్, అత్తరుల సువాసనలు, గాజుల వ్యాపారం, ప్రత్యేక దుస్తులు, రకరకాల తినుబండారాలు రంజాన్ హడావుడిని మరింత పెంచుతాయి. నగర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రంజాన్ షాపింగ్ కోసం హైదరాబాద్‌కు తరలివస్తారు. పాతబస్తీలో రాత్రి బజార్ వేడుకలా సాగి, వ్యాపారులకు అదిరిపోయే లాభాలను అందిస్తుంది.

24 గంటల వ్యాపార అనుమతితో వ్యాపారులకు బూస్ట్
ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు శుభవార్త అందించింది. మార్చి 2 నుంచి 31 వరకు, రంజాన్ మాసం సందర్భంగా వ్యాపార సముదాయాలకు 24 గంటల పాటు పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారులు మరింత సుదీర్ఘంగా పని చేసుకునే వీలు లభించనుంది. పాతబస్తీ గాజుల వ్యాపారంతో పాటు, ముత్యాల, అత్తరు, వస్త్ర దుకాణాలన్నీ 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అవకాశం ఉంది. దీని వల్ల వ్యాపారుల ఆదాయానికి పెరుగుదల ఉంటుందని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపారుల హర్షం
రంజాన్ వ్యాపారాలపై తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యాపారులు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ఏడాదంతా జరుగుతున్న వ్యాపారం ఒకెత్తయితే, రంజాన్ సమయంలో జరిగే వ్యాపారం మరొకెత్తని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి భారీ లాభాలను అందించే అవకాశం కల్పించనుంది. ఇదే సమయంలో, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు కూడా ప్రత్యేక పనివేళల సడలింపు కల్పించిన ప్రభుత్వం, వ్యాపారులకు కూడా మద్దతుగా నిలబడడం హర్షణీయమని అభిప్రాయపడుతున్నారు. రాత్రంతా బిజినెస్ చేసే అవకాశం రావడంతో, ఈసారి రంజాన్ షాపింగ్ హైదరాబాద్‌లో మరింత హుషారుగా జరగనుంది.