2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా(68,86,532) మంది కార్మికులను, తొలగించారని, 2022-23లో 86,17,887 మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులను తొలగించినట్లు తెలిపారు.

నకిలీ,తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయని మంత్రి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు రూ.282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు రూ.15.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.
దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. దీనిని బట్టి ఉపాధి పొందేవారి సంఖ్య అర్థం అవుతుంది.ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. అయితే జాబ్ కార్డులను తొలగించే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులను రద్దు చేయలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ స్పష్టం చేశారు.