ఎనిమిదేళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2016-17 సిరీస్-4 బాండ్ల మెచ్యూరిటీ తేదీని మార్చి 17గా నిర్ణయించడంతో, పెట్టుబడిదారులు దాదాపు మూడు రెట్ల లాభం పొందనున్నారు.
లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు
భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో 2015 నవంబర్‌లో RBI ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. 2017 మార్చిలో జారీ చేసిన నాల్గవ విడత బాండ్ల మెచ్యూరిటీ ధరను తాజాగా RBI ప్రకటించింది. ఆ సమయంలో గ్రాముకు రూ.2,943 చొప్పున బాండ్లను జారీ చేయగా, ప్రస్తుత ధరను రూ.8,624గా నిర్ణయించారు. దీని ప్రకారం, అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లభిస్తాయి. దీనికి అదనంగా, బాండ్లపై ఏటా 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

సగటు ధరను పరిగణనలోకి ..
గ్రాము ధరను నిర్ణయించడానికి, మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజులపాటు 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా, 2019-20 సిరీస్-4 సంబంధించిన ప్రీ-మెచ్యూరిటీ విండోను కూడా మార్చి 17గా నిర్ణయించారు. దీనికి గ్రాము ధరను రూ.8,634గా నిర్ణయించారు. ఈ ధరను నిర్ణయించడానికి మెచ్యూరిటీకి ముందు వారం చివరి మూడు పని దినాలను (మార్చి 11, 12, 13 తేదీలు) పరిగణనలోకి తీసుకుంటారు.
మెచ్యూరిటీకి సావరిన్ గోల్డ్ బాండ్లు
అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్లు మెచ్యూరిటీకి రావడంతో పెట్టుబడిదారులకు ఇది నిజంగానే పండగలాంటి సమయం.