Rahul Gandhi: ఏప్రిల్ 19 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా ఆయన బ్రౌన్ యూనివర్శిటీని సందర్శిస్తారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఆయన యూఎస్‌లో ఎన్ని రోజులు పర్యటిస్తారనేది తెలియదు. అంతేకాక.. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక, గతేడాది సెప్టెంబరులో మూడ్రోజులు రాహుల్ యూఎస్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రిజర్వేషన్లు, భారత్‌లో మత స్వేచ్ఛ వంటి అంశాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

దేశంలో అన్నివర్గాల వారికీ పారదర్శకంగా అవకాశాలు
ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు. అప్పటివరకు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని, దేశంలో అన్నివర్గాల వారికీ పారదర్శకంగా అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందన్నారు. ఇక, సిక్కులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బీజేపీ ఆయన మాటలను ఖండించింది. విదేశాల్లో భారత్ పరువుతీస్తున్నారని మండిపడింది. సిక్కులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. బీజేపీ మద్దతున్న ఒక గ్రూప్ ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసం వెలుపల నిరసనలు సైతం తెలియచేసింది.