అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు పరామర్శించారు.

భర్త మరణ వార్త తెలుసుకున్న లండన్‌లో ఉన్న విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీ (Anjali Rupani) ఇవాళ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. రూపానీ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లండన్‌లో ఉన్న కూతుర్ని కలిసేందుకు గుజరాత్ మాజీ సీఎం డ్రీమ్‌లైనర్ విమానం ఎక్కారు. గతవారమే ఆయన భార్య అంజలి రూపానీ లండన్ బయల్దేరి వెళ్లారు. అయితే కొన్ని పనుల కారణంగా విజయ్ రూపానీ ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. పనులు ముగించుకొని విజయ్ రూపానీ కూడా గురువారం లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కారు. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే అది కూలిపోయింది. ఈ ఘటనలో విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా, దాంట్లో 241 మంది మరణించారు. 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ సీఎంగా రూపానీ బాధ్యతలు నిర్వర్తించారు.
2014లో తొలిసారి రాజ్‌కోట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఆనందీబెన్ పటేల్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2016లో సీఎం పగ్గాలు చేపట్టారు విజయ్ రూపానీ. 2021 వరకు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. 2021లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ సీఎం పదవిని చేపట్టారు. ఆయన సతీమణి అంజలి కూడా బీజేపీ మహిళా మోర్చాలో కీలక నేతగా ఉన్నారు.
Read Also:Elephant: పిక్నిక్ ఎంజాయ్ కుటుంబాలు ..ఏనుగు ఏంట్రీ తో