సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణాల సంఖ్య 46కి చేరింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఓమ్హర్మన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం, విమాన ప్రమాదంలో మిలిటరీ సిబ్బంది, పౌరులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ఇంకా 10 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పౌర నివాసాలపై కూలిన విమానం
ప్రధానంగా పౌర నివాసాలపై విమానం కూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనకు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ దళాల మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ విమానం ప్రమాదవశాత్తుగా కూలిందా? లేక యుద్ధం నేపథ్యంలో గాల్లోనే ధ్వంసమైందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
సూడాన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితి
2023 నుంచి సూడాన్‌లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ దళాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సూడాన్‌లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ విమాన ప్రమాదం యుద్ధానికి సంబంధించి మరో కొత్త ముప్పును రేకెత్తించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సూడాన్ పరిస్థితిని గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తాజా ఘటనపై మరింత దృష్టి సారించాయి.