- త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
- పవన్ వెంట ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. పవన్ వెంట ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

పవన్ కల్యాణ్ త్రివేణి సంగమంలో స్నానం చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సంప్రదాయ వేషధారణలో, కేవలం ధోతీ ధరించి, నీటిలో మునిగిన ఫోటోలు పెద్ద ఎత్తున పంచుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మహా కుంభమేళా మహత్యాన్ని గురించి ప్రశంసలు గుప్పించారు. అతి పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించడం గొప్ప అనుభూతి అని పవన్ పేర్కొన్నారు.
కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం భక్తుల్లో ఆసక్తి రేకెత్తించింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల పవన్ కల్యాణ్ చూపిస్తున్న గౌరవాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మహా కుంభమేళా తరహా అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ప్రపంచంలో మరెక్కడా లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.