UAE: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. ఈ చర్య భారత్- యూఏఈల మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోంది.

దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీ
రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు.
ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఆనవాయితీ
రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. కాగా, యూఏఈలో మరణశిక్షలు పడిన భారతీయులు 25 మంది ఉన్నారని, వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలుకాలేదని విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.