ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని ఆస్పత్రుల సంఘం వెల్లడించింది.
బకాయిలను విడుదల ఆలస్యం
ఇప్పటికే ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా, బకాయిలను విడుదల చేయకపోవడంతో తాము సేవలను కొనసాగించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాన్నీ ఇవ్వలేదని, చివరికి తమకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపాయి.
ఆర్థిక ఇబ్బందుల కారణం
ఇప్పటివరకు తమ సామర్థ్యానికి మించి సేవలు అందించామని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇకపై సేవలను కొనసాగించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు అధికారికంగా నోటీసులు పంపాయి. ప్రభుత్వ వైఖరి మారకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతింటాయని, దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై పడతుందని ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు తీవ్ర అసౌకర్యం
ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు తీవ్ర అసౌకర్యం కలగొచ్చని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.