చాలా కాలంగా దేశీయ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులతో పాటు బోనస్ ప్రకటన గురించి కీలక సమాచారాన్ని అధికారికంగా పంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులకు వీటికి సంబంధించిన వివరాలను షేర్ చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు వీటికి సంబంధించిన విషయాలపై కీలక సమాచారం అందించిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టెక్ మేజర్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సంస్థ ఉద్యోగులకు బోనస్, ఆలస్యం అయిన జీతాల పెంపుల పత్రాల గురించి ఉద్యోగులతో మాట్లాడారు. వాస్తవానికి ఇది ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరించడానికి, సంస్థ పరిహారం ప్రణాళికలపై స్పష్టత ఇవ్వడానికి ఏర్పాటు చేయటం జరిగింది.

ఆగస్ట్ వరకు వాయిదా
ఈ సమావేశంలో సీఈవో ఉద్యోగుల ఆందోళనలను అంగీకరించారు. ముఖ్యంగా వేతన పెంపులపై మాట్లాడుతూ.. వాస్తవానికి వీటిన ఏప్రిల్‌లో జరగాలని నిర్ణయించబడినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ.. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులతో సరిగ్గా సరిపోలడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే సంస్థ హామీ ఇచ్చిన పెంపులను గౌరవించడంలో నిబద్ధత ఉందని, అయితే ఇది కొంత మేరకు ఆలస్యంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఈవో రవి కుమార్ బోనస్ నిర్మాణంపై కూడా కీలక కామెంట్స్ చేశారు. కంపెనీ అర్హత గల ఉద్యోగులు తమ బోనస్లను ప్రణాళిక ప్రకారం అందుకుంటారని తెలిపారు. సమయానికిగాను చెల్లింపులు జరిపేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మా ఉద్యోగులు వారి కష్టపడి పని చేసినదానికి తగినంత న్యాయం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కంపెనీ ఈ మార్చి నెలలో బోనస్లు అందజేయనున్నది. ఈ బోనస్ లు పొందడానికి అర్హులైన ఉద్యోగులు మార్చి 10 నాటికి బోనస్ లెటర్స్ మెయిల్ ద్వారా పొందుతారని స్పష్టం చేశారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీ వృద్ధి, ఆవిష్కరణల పై దృష్టిని తప్పించటం లేదని వెల్లడించారు.
పరిగణనలోకి కంపెనీ ఆర్థిక పరిస్థితులు
కంపెనీ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు విజయాలను సాధించటానికి ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఉద్యోగులకు వేతన పెంపులు మరింత ఆలస్యాన్ని సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగుల మోటివేషన్ దెబ్బతీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.