ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కేసులో కీలక నిందితుడు తహవూర్ హుసైన్ రాణాను భారత్‌కు తీసుకురావడంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా సహకారంతో ఆయన్ను ఇండియాకు రప్పించామని NIA పేర్కొంది. పలు కేంద్ర సంస్థల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతమైందని తెలిపింది.

భారత్-అమెరికా ఒప్పందం కీలకం
తహవూర్ రాణాను భారత్‌కు రప్పించడంలో భారత్-అమెరికా మధ్య ఉన్న పారస్పర ఒప్పందం కీలకంగా మారిందని NIA స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం ఎంత కీలకమో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుందన్నది సంస్థ అభిప్రాయం. రాణా పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో కలిసి ముంబైపై దాడికి కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయని వివరించింది.
ముంబై దాడిలో రాణా పాత్ర
2008లో ముంబైలో జరిగిన భయానక ఉగ్రదాడిలో మొత్తం 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమానికి లష్కరే తోయ్బా వంటి ఉగ్ర సంస్థలు బాధ్యత వహించగా, తహవూర్ రాణా ఆ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు NIA వెల్లడించింది. ముంబై దాడికి సంబంధించి న్యాయ విచారణ త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొంది.ఈ అరెస్ట్‌తో ముంబై కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.