హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్ ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఖరారు చేశారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డును తయారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాను ఖరారు చేశారు. రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు
ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో…కొత్త రేషన్ కార్డులు పొందేందుకు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు
ఈ ఏడాది మార్చి 30న ఉగాది పండుగ నిర్వహించుకోనున్నాం. ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 13 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.