Nepal : హింసాత్మక ఘటనపై నేపాల్ మాజీ రాజుకు జరిమానా నేపాల్‌లో రాచరిక పునరుద్ధరణ కోసం నిర్వహించిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది.ఈ ఘటనలకు కారణంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షాపై జరిమానా విధించేందుకు కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే ఆయన నివాసానికి నోటీసులు పంపించారు.దాదాపు రెండున్నర శతాబ్దాల పాటు నేపాల్‌లో రాచరిక పాలన కొనసాగింది. 2008లో ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటికీ, దేశం అంతటా రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అనేక ప్రభుత్వాలు మారుతూ రావడం, ప్రజల్లో అసంతృప్తిని పెంచింది.దీనికి తోడు మాజీ రాజు జ్ఞానేంద్ర షా, ప్రజలకు వీడియో సందేశం ద్వారా తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.జ్ఞానేంద్ర పిలుపు ఇచ్చిన తర్వాత రాచరిక అనుకూల ఉద్యమం ఊపందుకుంది. రెండు రోజుల క్రితం కాఠ్‌మాండూలో ఆయన మద్దతుదారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు.అయితే, ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించాయి.

నిరసనల్లో ఇద్దరు మరణించగా, 110 మంది గాయపడ్డారు. ప్రభుత్వ భవనాలు, వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేసి ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు.కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా, జరిగిన విధ్వంసానికి మాజీ రాజు జ్ఞానేంద్ర షానే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. అందుకే 7,93,000 నేపాలీ రూపాయల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు మహారాజ్‌గంజ్‌లోని “నిర్మలా నివాస్”, అంటే మాజీ రాజు నివాసానికి పంపించామని వెల్లడించారు.నేపాల్‌లో రాజకీయ అస్థిరత ఇప్పటికీ నిరంతర సమస్యగా మారింది. రాచరికాన్ని మళ్లీ పునరుద్ధరించాలన్న డిమాండ్లు, ప్రజాస్వామ్య వ్యవస్థపై పెరిగిన అసంతృప్తి రాజకీయ ఉత్కంఠ పెంచే అవకాశం ఉంది. ఈ ఘటన నేపాల్ రాజకీయ భవిష్యత్తుపై మరింత ప్రభావం చూపుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.