ప్రస్తుత కాలంలో పెళ్లి అనే పవిత్ర బంధానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగించే విషయం. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కొన్ని రోజులు గడిపి, ఆ తర్వాత తన ప్రియుడితో పారిపోయే మహిళల సంఖ్య పెరుగుతోంది.కొందరు భర్తలను వదిలేసి వెళ్తుండగా మరికొందరు భర్తలను అడ్డు తప్పించుకుని వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ (Meghalaya Honeymoon Murder) కేసు తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్ (Jharkhand) లో ఓ మహిళ పెళ్లైన 10 రోజులకే భర్తకు విషమిచ్చి చంపేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతి పెళ్లైన 36 రోజులకే హనీమూన్‌కు ముందే భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అది తెలిసి ఆ భర్త హమ్మయ్య బతికిపోయా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. తాజాగా అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది.
వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా సిటీకొత్వాలి ప్రాంతంలోని సారవా గ్రామంలో ఓ సంఘటన జరిగింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఆ నవ వధువు తన ప్రియుడితో లేచిపోయింది. అయితే తన భార్య పోతూ పోతూ లక్షల విలువైన నగలు, డబ్బుతో పారిపోయిందని ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని భార్యను పట్టుకుని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.సారావా గ్రామానికి చెందిన సల్మాన్ (Salman) వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన లోనీ ప్రాంతంలో నివసించే సనా అనే యువతితో సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు. మే 13వ తేదీన రాత్రి సనా తన భర్త, కుటుంబ సభ్యులకు లస్సీ చేసి ఇచ్చింది. ఆ లస్సీ తాగిన తర్వాత అంతా స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల వారు తలుపు తెరిచి వారిని నిద్రలేపారు. అయితే తన భార్య కనిపించకపోవడంతో సల్మాన్‌కు అనుమానం వచ్చింది.
అసలు విషయం
తన ఇంట్లో ఉన్న రూ.44,500 నగదు, లక్షల విలువైన నగలు కూడా మాయమయ్యాయని వారు గుర్తించారు.దీంతో ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సల్మాన్ కుటుంబం చెక్ చేయగా అసలు విషయం బయటికి వచ్చింది. రాత్రి 12:30 గంటలకు సనా ఓ యువకుడితో బైక్‌పై వెళ్తున్నట్లు ఆ వీడియోలో గుర్తించారు. దీని ఆధారంగా లస్సీలో సనా (Sana)మత్తు పదార్థాలు కలిపి తాగించి ఆపై తన ప్రియుడితో పారిపోయిందని కుటుంబ సభ్యులు పసిగట్టారు. ఇదే విషయాన్ని సనా కుటుంబ సభ్యులకు చెప్పినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారు హాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాపూర్ కొత్వాలి (Hapur Kotwali) లో కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు సనాను పట్టుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో వెళ్లేందుకు సనా నిరాకరించడంతో పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also: Israel-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?