All-party meeting : జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను స్వల్పంగా ముగించి ఢిల్లీకి తిరిగి వచ్చారు. బుధవారం సాయంత్రం మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఇందులో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్థాన్‌తో సంబంధాలను తగ్గించడం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే అంశంపై చర్చ
ఈ క్రమంలోనే ఈ రోజు (గురువారం) సాయంత్రం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పహల్గామ్ దాడి తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. పాకిస్థాన్‌పై దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలతో పాటు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే అంశంపై చర్చ జరగనుంది. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఉందని ఆరోపణలు వచ్చాయి.
అత్యవసరమైతే జమ్ము లో రాష్ట్రపతి పాలన
కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో సీసీఎస్ (క్యాబినేట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేశారు. అటారి చెక్‌పోస్ట్ మూసివేత, పాకిస్తానీయులకు భారత్‌లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు అత్యవసరమైతే జమ్ము లో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
Read Also: పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు