కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన భార్య పల్లవి (64), భర్తను హత్య చేయడానికి ముందు కొన్ని రోజులపాటు హత్య చేసే మార్గాల గురించి ఇంటర్నెట్‌లో అన్వేషించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం రాత్రి బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పల్లవిని సోమవారం అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పల్లవి ఫోన్‌ను పరిశీలించగా మెడ వద్ద నరాలు,రక్తనాళాలు కోయడం ద్వారా ఒక వ్యక్తిని ఎలా చంపవచ్చనే దానిపై ఆమె గూగుల్‌లో వెతికినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా ఆమె ఇలాంటి సమాచారం కోసమే అన్వేషిస్తున్నట్లు సెర్చ్ హిస్టరీ ద్వారా తెలుస్తోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. హత్యకు ముందు ఓం ప్రకాశ్ ముఖంపై పల్లవి కారం చల్లి, ఆ తర్వాత కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
గృహ హింస
పల్లవి గత కొంతకాలంగా స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. అయితే, భర్త తనను గృహ హింసకు గురిచేసేవాడని, అందుకే ఈ దారుణానికి పాల్పడ్డానని ఆమె ఆరోపిస్తున్నారు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘గృహ హింస’ అంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు.
ఉద్రిక్తత
కర్ణాటక 38వ డీజీపీగా మార్చి 1, 2015న నియమితులైన ఓం ప్రకాష్ విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆయన హోమ్ గార్డ్స్ కమాండెంట్ జనరల్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కుల అమలు, కర్ణాటక లోకాయుక్త, నేర పరిశోధన విభాగం (సిఐడి )లో పనిచేశారు. ఆయన రవాణా కమిషనర్‌గా కూడా సేవలందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఓం ప్రకాష్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద సంఘటనల దర్యాప్తులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న జరిగిన చర్చి స్ట్రీట్ పేలుడు ఘటనల సమయంలో ముఖ్య పాత్ర పోషించారు.
Read Also: PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం