మరికొన్ని రోజుల్లో బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ.. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టుల ప్రకటనతో బిహార్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బిహార్‌లోని కరాకట్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే అదే వేదికపై బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitesh Kumar) చేసిన పని ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ అనబోయి.. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్
కరాకట్ బహిరంగ సభలో ప్రసంగించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ పేరును మర్చిపోయారు. తన ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ అని సంబోధించారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గుర్తించిన నితీష్ కుమార్.. వెంటనే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అనబోయి.. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ అని పేర్కొన్నారు. పొరపాటును గమనించి వెంటనే తడబడిన నితీష్ కుమార్.. ఒక్క క్షణం ఆగి.. మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు
ఇక తన ప్రసంగంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ పేరును ప్రస్తావించిన నితీష్ కుమార్.. దాన్ని కవర్ చేయడానికి.. “అటల్ బిహారీ వాజ్‌పేయ్ తో పహెలే కామ్ కియే థే.” (అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా అంతకుముందు అభివృద్ధి పనులు చేశారు) అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి.. సభలో ఉన్న అందరూ లేచి నిలబడి స్వాగతం పలకాలని నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో కూడా నితీష్ కుమార్ ఇలాంటి పొరపాట్లతో వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నప్పుడు నితీష్ కుమార్ చప్పట్లు కొట్టడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతకుముందు గతేడాది మార్చిలో పాట్నాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నితీష్ కుమార్ నవ్వుతూ చాట్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.
Read Also: Pak: వ్యూహాత్మక పొరపాట్లు సరిదిద్దుకొని దాడులు చేసాం: ఆర్మీ చీఫ్