బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాన్యా రావు అరెస్ట్… కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు
కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది బంగారం స్మగ్లింగ్ కేసు. ఈ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాన్యా రావు (Ranya Rao) వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రాన్యా రావును భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో (smuggling case)అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం వెలుగులోకి రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. బుధవారం ఈడీ అధికారులు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చైర్మన్‌గా ఉన్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సోదాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
రాన్యా రావుతో పరమేశ్వర నేతృత్వంలోని కాలేజీకి సంబంధం?
ఈడీ దర్యాప్తులో ప్రస్తుతం ఒక కీలక అంశం బయటకు వచ్చింది. రాన్యా రావు అరెస్ట్ అనంతరం జరిగిన దర్యాప్తులో, ఆమెకు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చైర్మన్‌గా ఉన్న తుమకూరులోని మెడికల్ కాలేజీతో ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ గుర్తించినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో సోదాలు జరిగాయి. అప్పటి సమయానికి పరమేశ్వర కాలేజీలో లేరు. ఆయన తన అనుచరులతో వేరే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, కాలేజీ ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు ప్రాధాన్యతతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా, అకౌంటింగ్ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఫోన్‌లో రాజకీయ నాయకుల నంబర్లు.. రాజకీయాలపై దుమారం
రాన్యా రావు అరెస్టు తర్వాత ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల కాంటాక్ట్ నంబర్లు ఉన్నట్లు గుర్తించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, రాన్యా రావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఈ కేసును రాజకీయ నాయకులతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసు వెనుక రాజకీయ మద్ధతుదారుల ప్రమేయం ఉన్నదని ఆరోపణలు వస్తుండటంతో, ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తతను సంతరించుకుంది.
“రాజకీయ కుట్ర” అంటున్న డీకే శివకుమార్
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పరామర్శనీయంగా స్పందించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ‘‘వివాహానికి హాజరైనందుకే ఎవరైనా నేరస్తులు అవుతారా? ఇది అసత్య ప్రచారంగా, కాంగ్రెస్ పరువు దెబ్బతీయడానికి బీజేపీ చేసిన యత్నం మాత్రమే’’ అని ఆయన అన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తమ ఆరోపణలపై నిలబడి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు కేవలం నటి అరెస్టుతో ముగియదని, పెద్దల ప్రమేయం బయట పడాల్సి ఉందని వారు పేర్కొంన్నారు.
రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే కేసుగా మారుతుందా?
రాన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు ఇప్పుడు కేవలం నేరపూరిత అంశంగా కాక, రాజకీయ సంక్లిష్టతను కూడగట్టుకుంటోంది. ఈడీ దర్యాప్తులో ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడతాయో తెలియదు. కానీ ఇప్పటివరకు వచ్చిన అంశాలు చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చికాకు కలిగే పరిణామాలు తప్పక జరిగేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమీపంలో జరుగుతున్న ఈ దర్యాప్తు, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. దీనికి బీజేపీ పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ రక్షణాత్మకంగా వ్యవహరిస్తోంది.