కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ చేసిన తాజా ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రతినిధుల కోసం అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన విధానం పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే కార్యాలయాల్లో రిక్లైనర్లు ఏర్పాటు చేయాలన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికాగా, ఇప్పుడు మసాజ్ కుర్చీలను కూడా ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదన మరోసారి వివాదాస్పదంగా మారింది.

రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు – అసెంబ్లీ స్పీకర్ వివరణ
స్పీకర్ ఖాదర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో సభ్యులు గంటల తరబడి చర్చలు సాగిస్తున్నారని, దాంతో ఒత్తిడి తగ్గించేందుకు వీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజాసేవలో నిమగ్నమై ఉండే కారణంగా శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని, అందుకే ప్రతి ఎమ్మెల్యే కార్యాలయానికి స్మార్ట్ లాక్‌లు, రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కోసం రూ. 3 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఈ సౌకర్యాలను కొనుగోలు చేయబోమని, కేవలం అద్దె పద్ధతిలో తీసుకుంటామని కూడా ఆయన వివరించారు. ఎమ్మెల్యేలను శత్రువుల మాదిరి చూడొద్దని, వారిని స్నేహితుల్లా చూడాలని ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ మీ తండ్రి, సోదరుడు ఎవరైనా పెద్ద వయసులో ఎమ్మెల్యే అయితే, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఏర్పాట్లు చేయరా? అంటూ ప్రజలకు ఎదురు ప్రశ్న వేశారు.
కర్ణాటక మంత్రుల మద్దతు
స్పీకర్ ఖాదర్ ప్రతిపాదనలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే మద్దతు ప్రకటించారు.నాకు రిక్లైనర్లు, మసాజ్ కుర్చీల గురించి తెలియదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు హాజరయ్యేలా చేయడానికి స్పీకర్ ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పేం కాదు. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా స్పందిస్తూ, చాలా మంది శాసనసభ్యులు సీనియర్ సిటిజన్లు. అసెంబ్లీలో చాలా గంటలపాటు కొనసాగుతున్న చర్చల వల్ల వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఇది వారి ఉత్పాదకతను పెంచుతుంది. అంటూ ఖాదర్ వ్యాఖ్యలను సమర్థించారు. బీజేపీ ప్రతిదాన్నీ రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఈ ప్రతిపాదనపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది. అది అనవసర ఖర్చు అని, కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం అని విమర్శించింది. కర్ణాటకలో నిధుల కొరత ఉందని, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ధ్వజమెత్తారు. ముందు రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల అప్పు చెల్లించండి, తర్వాత మీ సౌకర్యాల కోసం మసాజ్ కుర్చీలు తెచ్చుకోండి. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అదే విధంగా, బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ – మాకు మసాజ్ కుర్చీలు అవసరం లేదు. ప్రజా ధనాన్ని అవసరమైన అభివృద్ధి పనులకు వినియోగించండి. అంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాదంలో ప్రభుత్వ వైపు, ప్రతిపక్షం వైపు వాదనలు విన్నప్పటికీ, ప్రజా అభిప్రాయం కూడా చాలా కీలకం. ఎమ్మెల్యేలు ప్రజాసేవ కోసం ఎన్నుకోబడినవారా? లేక ప్రజాధనాన్ని వారి సౌకర్యాల కోసం వినియోగించుకునే వారా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.