Indoor couple అదృశ్యం ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది
మేఘాలయలో హనీమూన్‌కు వచ్చిన ఇండోర్ జంట అదృశ్యం కావడం తర్వాత ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తెరపైకి వస్తోంది. మే 23న కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 2న కనుగొనగా, అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కనిపించినా, తాజాగా వెలుగులోకి వస్తున్న ఆధారాలు హత్య కోణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. భర్త మృతదేహంపై ఉన్న ఉంగరం, గొలుసు మాయమైనట్లు తెలుస్తుండగా, ఒక కత్తి, రక్తపు మరకలతో కూడిన రెయిన్‌కోట్, మరియు ఇతర ఆధారాలు దంపతులపై జరిగిందేమిటన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
ముగ్గురు అనుమానితులతో ప్రయాణించిన దంపతులేమో?
Indoor couple అదృశ్యమైన రోజున, వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ తాజాగా వెల్లడించడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆల్బర్ట్ ప్డే అనే గైడ్.. రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్‌లను మే 23న ఉదయం సుమారు 10 గంటల సమయంలో నాన్‌గ్రియాట్ నుంచి మావ్లాఖియాట్ వైపు 3,000 మెట్లకు పైగా ఎక్కుతుండగా చూశానని తెలిపారు. అంతకు ముందు రోజు తాను వారికి గైడ్‌గా సేవలందిస్తానని చెప్పగా, వారు సున్నితంగా తిరస్కరించారని ఆల్బర్ట్ గుర్తు చేసుకున్నారు.
“ఆ నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా, మహిళ వారి వెనుక వస్తున్నారు. ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు ఖాసీ, ఇంగ్లిష్ మాత్రమే తెలుసు కాబట్టి వారేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు” అని ఆల్బర్ట్ ప్డే చెప్పినట్లు పీటీఐ ఉటంకించింది. తాను మావ్లాఖియాట్ చేరుకునే సమయానికి వారి స్కూటర్ అక్కడ లేదని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశానని గైడ్ పేర్కొన్నాడు. నవ దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటర్ మావ్లాఖియాట్‌లోని పార్కింగ్ స్థలానికి చాలా కిలోమీటర్ల దూరంలో సోహ్రారిమ్ వద్ద తాళం చెవితో సహా వదిలేసి ఉండటం గమనార్హం.
మృతదేహం లభ్యం.. హత్యకు బలైన్నాడా రాజా?
రోజుల తరబడి గాలించిన అనంతరం జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సహాయక సిబ్బంది ఒక లోయలో గుర్తించారు. అతని శరీరంపై ఉన్న బంగారు ఉంగరం, మెడలోని గొలుసు మాయమవడం హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఆ మరుసటి రోజు సమీపంలోనే రక్తపు మరకలతో కూడిన ఒక కత్తిని కూడా అధికారులు కనుగొన్నారు. రెండు రోజుల తర్వాత సోహ్రారిమ్ నుంచి రాజా మృతదేహం దొరికిన లోయకు మధ్యలో ఉన్న మావ్క్మా గ్రామంలో దంపతులు ఉపయోగించిన రెయిన్‌కోట్ ఒకటి లభ్యమైంది. ఈ ఆధారాలన్నీ రాజా హత్యకు గురై ఉండవచ్చని సూచిస్తుండటంతో, అతని భార్య సోనమ్ కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పర్వతారోహకులు, జాగిలాలు, డ్రోన్లతో గాలిస్తున్నారు. అయితే, క్లిష్టమైన భూభాగం, అతి భారీ వర్షాలు, కొన్ని అడుగుల దూరం కూడా కనిపించకుండా అడ్డుకుంటున్న పొగమంచు వాతావరణం గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారాలు
దంపతుల అదృశ్యానికి ముందురోజు జరిగిన కార్యకలాపాలను బట్టే దర్యాప్తు కొనసాగుతోంది. ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో వారు స్కూటర్‌పై ప్రయాణిస్తున్నట్లు కనిపించగా, మరొక ఫుటేజ్‌లో వారు గెస్ట్‌హౌస్ వద్ద తమ లగేజీ భద్రపరచడం కనిపించింది. హోటల్‌లో గదులు లభించకపోవడంతో వారు లగేజీ భద్రంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. వారు ప్రసిద్ధ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్‌ను సందర్శించి తిరిగి వస్తామని చెప్పినట్లు హోటల్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ వీడియోలు దంపతులు సురక్షితంగా ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలియజేస్తున్నా, తర్వాత జరిగిన ఘటనలు దర్యాప్తును క్లిష్ట దశకు తీసుకెళ్లాయి.
ప్రభుత్వం తీరుపై సోనమ్ కుటుంబం ఆగ్రహం
షిల్లాంగ్‌లో ఉన్న సోనమ్ సోదరుడు గోవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సోనమ్ చనిపోయిందన్న పంచ్‌లైన్‌తో గాలిస్తున్నారు. కానీ ఆమె బతికే ఉందన్న నమ్మకం మాలో ఉంది. ఈ కేసును సీబీఐ లేదా ఇతర నిష్పాక్షిక ఏజెన్సీకి అప్పగించాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియెమ్ మాట్లాడుతూ, “మేము మా శాయశక్తులా శోధిస్తున్నాం. అత్యాధునిక పరికరాలతో గాలింపు కొనసాగుతుంది” అని తెలిపారు.
ఈ కేసు మేఘాలయలో తీవ్ర సంచలనం సృష్టించగా, సోనమ్ ఆచూకీ వెలుగులోకి వస్తుందన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.
Read also: Tension in Manipur : మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస