యుద్ధ వాతావరణంలో దేశానికి అండగా కార్పొరేట్ దిగ్గజాలు: అంబానీ, అదానీ ధీమా
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ, దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో తాము భారత ప్రభుత్వానికి పూర్తిస్థాయి మద్దతుగా ఉంటామని ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ మరియు ముఖేశ్ అంబానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, దేశ సేవకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమయ్యే అన్ని సహాయాలను అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ ఇద్దరు అపర కుబేరులు స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని వారు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. వారి ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

“ఇలాంటి సమయంలో మన ఐక్యతే మన బలము” – గౌతమ్ అదానీ
పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతంగా కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీ స్పందిస్తూ, “ఇలాంటి సంక్షోభ కాలాల్లోనే మన దేశప్రేమ, మన ఐక్యత, మన నిజమైన బలము బైటపడతాయి. మన తల్లిదేశి గౌరవాన్ని, మన ప్రజల భద్రతను కాపాడే బాధ్యతను భారత సాయుధ దళాలు భుజాలపై తీసుకున్నాయి. వారు చేస్తున్న త్యాగాలకు మా పూర్తి సంఘీభావం. దేశానికి ఏ అవసరం వచ్చినా, మేమున్నాం. ఇండియా ఫస్ట్. జై హింద్!” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రకటన దేశ ప్రగతిపరులు, యువతలో దేశభక్తిని మరింత ప్రేరేపించింది.
“దేశానికి అండగా నిలవడానికి రిలయన్స్ సిద్ధంగా ఉంది” – ముఖేశ్ అంబానీ
మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా దేశానికి మద్దతుగా నిలిచారు. ఆయన ట్వీట్ చేస్తూ, “దేశానికి అన్ని విధాలుగా అండగా నిలవడానికి రిలయన్స్ కుటుంబం పూర్తిగా సిద్ధంగా ఉంది. దేశ ప్రజలకు ఏ అవసరమైనా తక్షణమే అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్ నుండి సవాళ్లు ఎదురవుతున్న సమయంలో, మన సాయుధ దళాలు చూపిస్తున్న ధైర్యం, కట్టుబాటు దేశానికే గర్వకారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దళాలు ప్రతి చర్యకు ధీటుగా స్పందించాయి. ఉగ్రవాదంపై తాము ఎటువంటి నిష్క్రియత చూపబోమని కేంద్రం స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలవాల్సిన సమయం ఇది,” అని పేర్కొన్నారు.
అంతేగాక, “మన దేశం శాంతికి కట్టుబడి ఉంది. కానీ మన గౌరవాన్ని లేదా భద్రతను ఎప్పుడూ పణంగా పెట్టదు. కలిసి, మనం నిలబడతాం. మనం పోరాడుతాం. మనం గెలుస్తాం. జై హింద్! జై హింద్ కీ సేనా!” అంటూ అంబానీ తన పోస్టులో పేర్కొనడం గమనార్హం.
Read also: Prahalad Joshi : ఆహార ధాన్యాల కొరత వట్టిదే : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి