కూనూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజులను దొంగిలించడానికి ప్రయత్నించిన డీఎంకే కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా X పేజీలో పోస్ట్ చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై అధికార పార్టీ డీఎంకేపై నిప్పులు చెరిగారు.
గాజులను లాక్కోవడానికి యత్నం
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా, తమిళనాడు అంతటా డీఎంకే సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా, ఈ కార్యక్రమం నీలగిరి జిల్లా కూనూర్‌లో కూడా జరిగింది. అన్నా విగ్రహం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రతిజ్ఞ చదువుతున్నప్పుడు, జాకీర్ హుస్సేన్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల చేతులకు ఉన్న గాజులను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఇది చూసి, సమీపంలో ఉన్న మరొక నాయకురాలు అతని చేతిని మెల్లగా తీసివేశారు. ఒకటి రెండు సెకన్లలోనే జాకీర్ హుస్సేన్ తన చేతిని సుశీల చేతిపై తిరిగి వేసి గాజులను తొలగించడానికి ప్రయత్నించాడు. సుశీల వెంటనే తన చేతిని కిందకి దించింది. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన వారు డీఎంకే నేతల తీరును విమర్శిస్తున్నారు.
అధికార పార్టీ డీఎంకే విమర్శలు
ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కూడా ఈ వీడియోను తన ‘X’ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు, “కూనూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని వార్డ్ 25 డిఎంకె కౌన్సిలర్ మిస్టర్ జాకీర్ హుస్సేన్, హిందీ వ్యతిరేకత ముసుగులో గాజులు దొంగిలిస్తున్నారు” అనే క్యాప్షన్‌తో పాటు. “దొంగతనం, డీఎంకేను ఎప్పటికీ వేరు చేయలేము!” అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ డీఎంకే తీరుపై తీవ్రంగా విమర్శించారు.