కర్ణాటకలో బైక్ టాక్సీల సేవలపై కోర్టు ఆదేశాల మేరకు నిషేధం విధించడంతో, ఆ నిర్ణయం ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బైక్ టాక్సీల మౌలిక వసతి ఆగిపోవడంతో నగరాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆటోరిక్షాలపై ఆధారపడే వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బైక్ టాక్సీ (Bike taxi) లు తిరగకుండా చేయడంతో ఆటో డ్రైవర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వారు ఛార్జీలను తమ ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. రాత్రికి రాత్రే కనీస ఛార్జీని రూ.10 నుంచి ఏకంగా రూ.70 వరకు పెంచేశారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా, టిప్ ఇవ్వకపోతే ఆటో ఎక్కించే ప్రసక్తే లేదని, పలుచోట్ల మోటార్ మీటర్లను కూడా ఆపేసి అద్దెను నేరుగా కోరుతున్నారని చెబుతున్నారు.
ప్రయాణికుడు
రోజువారీగా ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇదివరకు 30 రూపాయలకు వెళ్లిన మార్గం ఇప్పుడు 80 రూపాయలు తీసుకుంటున్నారు. బైక్ టాక్సీలు ఇప్పటికైనా తిరిగి రావాలి. లేకపోతే ప్రజలపై భారం పెరుగుతుంది” అని ఓ ప్రయాణికుడు వాపోయాడు.ఆటో ఎక్కాలంటే జేబుకు చిల్లు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ ఛార్జీల పెంపు స్పష్టంగా కనిపించగా, మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రద్దీ సమయాల్లో
ప్రముఖ రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో కనీస ఛార్జీలు రాత్రికి రాత్రే రూ.10 నుంచి రూ.70 వరకు పెరిగాయని పలువురు ప్రయాణికులు తెలిపారు. కోరమంగళ ఫస్ట్ బ్లాక్ నుంచి లాంగ్‌ఫోర్డ్ రోడ్డులోని తన కార్యాలయానికి ప్రయాణించే సోయిబం జయానంద సింగ్ (Shoibam Jayanand Singh) అనే ప్రయాణికుడు మాట్లాడుతూ సాధారణంగా రద్దీ సమయాల్లో ఆటో ప్రయాణానికి రూ.140 నుంచి రూ.150 ఖర్చయ్యేదని, ఇప్పుడు అది మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందిరానగర్ (Indiranagar) లో నివసిస్తూ రిచ్‌మండ్ టౌన్‌లో పనిచేసే మరో ప్రయాణికురాలు మాట్లాడుతూ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఛార్జీలు సుమారు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయని తెలిపారు. అంతేకాకుండా, కనీసం రూ.60 టిప్ ఇస్తే తప్ప ఆటో రైడ్ దొరకడం కష్టంగా మారిందని ఆమె వాపోయారు.
పెరిగిందని
సుల్తాన్‌పాళ్య నుంచి హెబ్బాల్‌కు ప్రయాణించే స్నేహ అనే యువతి మాట్లాడుతూ సాధారణంగా రూ.120 ఉండే ఛార్జీ నమ్మా యాత్రిలో రూ.25, రాపిడో, ఓలాలో రూ.40 వరకు పెరిగిందని అన్నారు. అదేవిధంగా, అక్షయ్‌నగర్ నుంచి ఎంజీ రోడ్డుకు 11 కిలోమీటర్ల ప్రయాణానికి సాధారణంగా రూ.160 కాగా, మంగళవారం మధ్యాహ్నం రూ.230 వసూలు చేసినట్లు తెలిసింది.ఈ ధరల పెరుగుదల మార్కెట్ శక్తుల ప్రత్యక్ష పర్యవసానమేనని ఓ ప్రముఖ రైడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ (Aggregator platform) కు చెందిన ప్రతినిధి తెలిపారు. ఏదేమైనా, డిమాండ్‌కు అనుగుణంగా వేగంగా ఛార్జీలను మార్చే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రస్తుతం చట్టపరమైన పరిశీలనలో ఉంది. ఈ ఆకస్మిక ఛార్జీల పెంపుతో బెంగళూరు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తీవ్రంగా నష్టపోయామని
ఇదిలా ఉండగా, ఆటో డ్రైవర్లు మాత్రం తమకూ కారణాలున్నాయని చెబుతున్నారు. పెరిగిన ఇంధన ధరలు, భద్రతా సమస్యలు, ప్రయాణికుల తీరుతో తాము ఇబ్బందులు పడుతున్నామని, కనీస అద్దె పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కొందరు డ్రైవర్లు అయితే, బైక్ టాక్సీలతో తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, కోర్టు తీర్పుతో కొంత ఊపిరి పీల్చుకున్నామని స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం నగరంలో రవాణా పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రయాణికులు సరైన ధరలకు రవాణా సదుపాయాలు అందక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆటో అద్దెలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి,మున్ముందు ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం, రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Read Also: Vangalapudi Anitha: యోగా నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు – మంత్రి అనిత