Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాటలు, వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. నిందితుడిని గుర్తించిన పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలిక కనిపించడం లేదని కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె కోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా.. పొలాల్లో తీవ్ర గాయాలతో, నగ్నంగా కనిపించింది. వెంటనే ఆ బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలుకి గాయం
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఈక్రమంలో దాన్ సింగ్ (24) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, అతడు పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలుకి గాయమవడంతో అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి ముఖంపై బలమైన గాయాలు
ఇక, ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కీలక విషయాలు వెల్లడించారు. ఒకరు కంటే ఎక్కువమంది బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోందన్నారు. చిన్నారి ముఖంపై బలమైన గాయాలైనట్లు వెల్లడించారు. ఆమె ప్రైవేటు భాగాల పైనా అనేక గాయాలు ఉన్నాయన్నారు. తాను చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.