అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేశ్ తరపు న్యాయవాదులు నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
‘చినబాబు తిండికి 25 లక్షలండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవమని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారంటూ కథనం ప్రచురితమైన మూడో రోజున అంటే 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్ న్యాయవాదులు నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన సాక్షి అదే ఏడాది నవంబర్ 10న సమాధానం పంపింది.
దీనిపై సంతృప్తి చెందని లోకేశ్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. విశాఖ విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నట్టు వార్తలో పేర్కొన్న తేదీల్లో తాను ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, అయినప్పటికీ దురుద్దేశంతో తన పరువుకు భంగం కలిగించేలా రాజకీయ లబ్ధికోసం అసత్యాలతో కథనం ప్రచురించారని లోకేశ్ తన దావాలో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణ కర్త మురళి, విశాఖ సాక్షి న్యూస్ రిపోర్టర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్‌లపై రూ. 75 కోట్లకు పరువునష్టం దాఖలు చేశారు.