ఈ ఏడాది సంపన్నులకు అంతగా కలిసిరాలేదేమో, ఎందుకంటే వీరి సంపద ఒక్కరోజులోనే భారీగా ఆవిరైపోతుంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు భారీగా నష్టాలను చవిచూశారు. దింతో వీరి సంపద దాదాపు $30.5 బిలియన్లు (రూ. 2.6 లక్షల కోట్లు) తగ్గింది. స్టాక్ మార్కెట్ అస్థిరత, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఇలా జరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల చాలా నష్టం జరిగింది.
ట్రంప్ అమెరికా దేశ దిగుమతులు, ఎగుమతులపై అత్యధిక పన్నులు విధించిన సంగతి మీకు తెలిసిందే, ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలను రేకేతించింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. అలాగే భారతదేశంతో సహా చాల దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచంలోని ధనవంతులను మాత్రమే కాకుండా భారతదేశంలోని ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ , శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సంఘ్వి, అజీమ్ ప్రేమ్‌జీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా ప్రభావితం చేసింది.

అందరూ ఇబ్బందుల్లో..
భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద ఈ సంవత్సరం 3.42 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్ నుండి కూడా అంబానీ వైదొలగారు. ప్రస్తుతం అంబానీ 17వ స్థానంలో ఉండగా, ఆయన సంపద $87.2 బిలియన్లు. అంతేకాక ఈ సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 0.10% క్షీణించాయి. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 24% నష్టాన్ని చవిచూసింది. ఇక గౌతమ్ అదానీ సంపద కూడా $6.05 బిలియన్లు తగ్గింది. మార్కెట్లో ప్రతికూల వాతావరణం కారణంగా అతని వ్యాపారం కూడా దెబ్బతింది. అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ సంవత్సరం దాదాపు 9% నష్టపోయింది. సావిత్రి జిందాల్ కూడా $2.4 బిలియన్ల నష్టాన్ని చవిచూసింది. HCL టెక్నాలజీస్ యజమాని శివ్ నాడార్ అతిపెద్ద నష్టాన్ని చూడగా, ఆయన సంపద 10.5 బిలియన్ డాలర్లు పడిపోయింది.
స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
ఈ సంవత్సరం భారత స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు 4.5% పడిపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వంటి చిన్న సూచీలు కూడా 14%, 17% చొప్పున పడిపోయాయి.ఈ తగ్గుదలకు ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) డబ్బు ఉపసంహరించుకోవడం. స్టాక్ మార్కెట్ షేర్ల ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాల వల్ల FIIలు భారత స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకున్నాయి. సుంకాల కారణంగా సన్నగిల్లిన నమ్మకం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను కూడా పెంచాయి. దింతో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పెట్టుబడిదారుల విశ్వాసం క్షీణించింది అలాగే ఎగుమతి పరిశ్రమలు దెబ్బతిన్నాయి. రాజకీయ అస్థిరత భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది.
Read Also: Naresh Goyal: ఆకాశానికి ఎదిగి.. చివరికి పాతాళములోకి జారిన నరేష్ గోయల్