SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు (బుధవారం) 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అదించనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ మందకృష్ణ ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడు ఎలాంటి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా అందజేస్తారని ప్రశ్నించారు.
దీనివల్ల తమ మాదిగ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మొత్తం 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని, కానీ వర్గీకరణ చేపట్టకపోవడంతో కనీసం తమకు 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం తమకు వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. DSC నియామకాలను నిరసిస్తూ MRPS రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.