హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపైకీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ద్వారా కేంద్రానికి అపరిమిత అధికారులు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును అన్ని పార్టీలు వ్యతిరేకించాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు 2025పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును పౌరుల డిజిటల్ గోప్యత ముప్పుగా అభివర్ణించిన కేటీఆర్…ఇందులో నిబంధనలు ఖండించారు.

కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం పరిధికి మించి అధికారాలను వినియోగించుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. అందుకు ఈ బిల్లు సహకరించేలా ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ అధికారులకు సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాల తనిఖీ పేరుతో అపరిమిత అధికారాలను ఇచ్చేలా ఉంది అని కేటీఆర్ అన్నారు. ఇందులో ప్రస్తావించిన వర్చువల్ డిజిటల్ స్పైసెస్ వేధింపులకు, దుర్వినియోగానికి, విస్తృత నిఘాకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం
ఇప్పటికే దేశ పౌరుల ఆర్థిక డేటా అనేక సంస్థల ఆధీనంలో ఉందని, ఇప్పుడు తీసుకొచ్చే చట్టం పౌరుల ప్రాథమిక హక్కులు, డిజిటల్ గోప్యతను తొక్కేస్తుందన్నారు. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అధికారులెవరైనా రూల్స్ దుర్వినియోగం చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని, ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా వ్యవహరించే ప్రమాదం ఉందని, ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. ఐటీ వ్యవస్థకు ప్రస్తుత నిఘా వ్యవస్థలు సరిపోతాయని కేటీఆర్ అన్నారు.