జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన ఈ యూట్యూబర్‌పై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, హర్యానా పోలీసులు తాజా ప్రకటనలో ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఉగ్రవాదులతో జ్యోతికి ఎలాంటి సంబంధాలూ లేవని (no links to terror) తెలిపారు. పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో (Pakistani intelligence officials) ఆమె సంప్రదింపులు కొనసాగించినట్లు చెప్పారు.

ఎలాంటి ఆధారాలూ లేవు
ఈ కేసు వివరాలను హిస్సార్ ఎస్పీ (Hisar SP) మీడియాకు వెల్లడించారు. ‘జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో గానీ, ఉగ్రవాదులతో గానీ సంబంధాలున్నట్లు ఇప్పటివరకూ మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆమె ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు కూడా ఎలాంటి సాక్ష్యాలూ లభించలేదు. పాకిస్థాన్ నిఘా వర్గాల అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లుగానీ, మతం మార్చుకోవాలనే ఉద్దేశం గానీ జ్యోతికి ఉన్నట్లు ధ్రువీకరించే పత్రాలు ఏవీ లభించలేదు. తాను మాట్లాడుతున్న వారు పాక్ గూఢచర్య సంస్థకు చెందినవారని ఆమెకు తెలుసు. అయినా, పూర్తి స్పృహతోనే వారితో సంప్రదింపులు కొనసాగించింది. అంతేకాదు, భారత సాయుధ బలగాల వ్యూహాలు, ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు’ అని హిస్సార్ ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు జ్యోతి డైరీ ఒకటి వెలుగులోకి వచ్చిందంటూ వస్తున్న వార్తలపై కూడా పోలీసులు స్పందించారు. అలాంటి డైరీ ఏమీ తాము స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. ఆమెకు చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. వాటిని పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.
Read Also : Tesla CFO: టెస్లా బంపర్ ఆఫర్.. ఢిల్లీ కుర్రాడికి వెయ్యి కోట్ల జీతం