Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసిన వీడియో ఒక సంచలనంగా మారింది.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సుప్రీంకోర్టు సమర్పించగా, అందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర ఆధారాలు ఉన్నాయి.ఈ ఆరోపణలపై జస్టిస్ వర్మ స్పష్టమైన వివరణ ఇచ్చారు.”ఇది పూర్తిగా ఒక కుట్ర.నా ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు చూపించడమే ఈ కుట్ర లక్ష్యం” అని ఆయన తెలిపారు. తన నివాసంలో లెక్కల్లో చూపని నగదు కాలిపోవడంపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. “నేను, నా కుటుంబం ఎప్పుడూ నగదును ఇంట్లో నిల్వ చేయము.మా లావాదేవీలన్నీ బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారానే జరుగుతాయి” అని ఆయన వివరించారు.కాలిపోయిన నగదును ఎవరూ స్వాధీనం చేసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో పంజాబ్ & హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధవాలియా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు తాత్కాలికంగా ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.ఇక విడుదలైన వీడియోపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై జాగ్రత్తగా పరిశీలన చేస్తోంది.జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల వెనుక నిజమైన కారణం ఏమిటో విచారణ తర్వాతే స్పష్టత వస్తుంది. ఇది నిజంగా కుట్రనా, లేక ఇంకేదైనా కుట్రదారుల ప్రణాళికలో భాగమా? సమయం మాత్రమే సమాధానం చెబుతుంది.