అమరావతి: తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారు ఈ నెల 22న చెన్నైలో జరగనున్న సౌత్ ఇండియా అఖిలపక్ష నాయకుల సమావేశానికి జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నాయకులకు ఇప్పటికే స్టాలిన్ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్ జగన్‌ను కలిశారు.

అధికార విపక్ష కూటములతో సమ దూరం
స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా ? లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ కేంద్రంతో, బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపినప్పటికీ రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో అధికార విపక్ష కూటములతో సమ దూరం పాటిస్తూ వచ్చింది.
స్టాలిన్‌తో జట్టుకడతారా ? లేదా?
ఇక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమిలో, అటు ఇండియా కూటమిలో చేరకుండా ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పోరాటం సాగించే స్టాలిన్‌తో జట్టుకడతారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయవర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఇండియా కూటమిలో ఉన్నారు. వ్యక్తిగతంగా స్టాలిన్‌తో జగన్ కు స్నేహం ఉంది. ఆ కారణంగానే 2019లో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు.