బాగ్దాద్(Baghdad) లో భద్రతాపరమైన ముప్పు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా(America) రాయబార కార్యాలయంలోని అత్యవసరసేవలకు చెందని ఉద్యోగులను, వారి కుటుంబాలను ఇరాక్(Iraq) నుంచి తరలించనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ తరలింపునకు కారణమేమిటనేదీ అధికారులు స్పష్టంగా బహిర్గతం చేయలేదు. అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యకు సిద్ధమైందని అమెరికా అధికారులకు సమాచారం అందిందని అమెరికా భాగస్వామి సీబీసీ రిపోర్ట్ చేసింది. అమెరికన్లు ఇరాక్‌ను వీడటానికి ఇది పూర్తిగా కారణం కాకపోయినప్పటికీ అక్కడి కొన్ని నిర్దుష్ట అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకారానికి దిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మా కార్యాలయ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించాం
ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా జరుపుతున్న చర్చలు గత కొన్నిరోజులుగా నిలిచిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ అణుకార్యక్రమాలపై ఆ దేశంతో చర్చించేందుకు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో మస్కట్‌లో సమావేశం కానున్నారని యాక్సియాస్ తెలిపింది.
”మా దౌత్య కార్యాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరమనేదీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం” అని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ”మా తాజా విశ్లేషణల ఆధారంగా, ఇరాక్‌లోని మా కార్యాలయ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించాం” అని వెల్లడించారు. కెన్నడీ సెంటర్‌కు వచ్చిన ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేయాలని అమెరికా పౌరులకు సలహా ఇచ్చారు. ఎందుకంటే‘‘ ఆ ప్రాంతం ప్రమాదకరమైన ప్రదేశం. ఏమైనా జరగవచ్చు” అని పేరొన్నారు. ఇరాన్ ఒక అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయాలని అమెరికా కోరుకోవట్లేదని ట్రంప్ పునరుద్ఘాటిచారు. ‘‘అలాంటిది జరగడానికి మేం అనుమతించం’’ అన్నారు.
అణ్వాయుధాల తయారీ నుంచి తెహ్రాన్‌ను కట్టడి
అణ్వాయుధాల తయారీ నుంచి తెహ్రాన్‌ను కట్టడి చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ట్రంప్ ఆశిస్తున్నారు. యూరేనియం శుద్ధిని ఇరాన్ ఆపేస్తుందని తనకంత నమ్మకం లేదని ట్రంప్ బుధవారం వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఈ వారం ప్రారంభంలో 40 నిమిషాల పాటు ఫోన్‌లో ట్రంప్ చర్చించారు. దౌత్య మార్గం కన్నా సైనిక చర్యతో సమస్య పరిష్కరించాలని నెతన్యాహు దీర్ఘకాలంగా చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఇతర అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ (ఐఏఈఏ) గవర్నర్ల బోర్డు వియన్నాలో సమావేశమైంది.
గుర్తుతెలియని ప్రదేశాలలో అణు పదార్థాలను కనుగొనడంపై సరైన వివరణ ఇవ్వడంలో తెహ్రాన్ విఫలమైందని, సరిగా సహకరించలేదని విమర్శిస్తూ ఐఏఈఏ ఓ నివేదిక విడుదల చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. అయితే ఐఏఈఏ నివేదిక సమగ్రంగా లేదని, ఇజ్రాయెల్ నుంచి పొందిన నకిలీ పత్రాలపై ఆధారపడిందని ఇరాన్ చెప్పింది. అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా ప్రకటన ఎంతమేర సానుకూల ఫలితాలను ఇస్తుందనేదీ ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
అమెరికా స్థావరాలపై తమ దేశం ప్రతీకారం: రక్షణ శాఖ మంత్రి అజీజ్
చర్చలు విఫలమైతే, ట్రంప్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై సైనిక దాడులకు ఆదేశిస్తే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై తమ దేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అజీజ్ నసీర్జాదెహ్ స్పష్టం చేశారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో ఉన్న అమెరికన్ సైనికుల కుటుంబాలు స్వచ్ఛందంగా వెళ్లిపోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ దేశాల్లో కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు కూడా ఉన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అణ్వాయుధం దిశగా ఇరాన్ అడుగులు వేస్తోందని పెంటగాన్ బుధవారం కాంగ్రెస్ ప్యానెల్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. తమ అణుశుద్ధి కార్యక్రమం పౌర అవసరాలకు అణుశక్తి ఉత్పాదన కోసమేనని, అణుబాంబు తయారీకి ప్రయత్నించట్లేదని ఇరాన్ చెబుతోంది. మరోవైపు బ్రిటన్ రాయల్ నేవీలో భాగమైన మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్ బుధవారం స్పందించింది. పశ్చిమాసియాలో సైనికపరమైన ఉద్రిక్తతలు పెరిగితే షిప్పింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపుపై వార్తలు రావడంతో, చమురు ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. ప్రాంతీయంగా అభద్రతా పరిస్థితుల వల్ల చమురు సరఫరాలో సమస్యలు తలెత్తుతాయనే సందేహాలే దీనికి కారణం.
Read Also: Israel: ఇరాన్ కీలక సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు హతం!