యుద్ధంలో చనిపోయిన 6వేల మంది సైనికుల మృతదేహాల పరస్పర బదిలీకి రష్యా, ఉక్రెయిన్ (Russia, Ukraine) అంగీకరించాయి. ఇకపై కూడా పరస్పరం యుద్ధ ఖైదీలను బదిలీ చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia, Ukraine War) తీవ్రరూపు దాలుస్తుండగా, మరోవైపు ఈ దేశాల ప్రతినిధుల మధ్య సోమవారం రెండో విడత శాంతి చర్చలు జరిగాయి. తుర్కియేలోని ఇస్తాంబుల్(Istambul)లో ఉన్న సిరాగన్ ప్యాలస్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ చర్చలకు తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మధ్యవర్తిత్వం వహించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే శాంతి చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా ఉండేలా నిర్ణయాలు వెలువడాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కావాలని ఇరుదేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
రెండో విడత శాంతి చర్చలు
రెండో విడత శాంతి చర్చల వివరాలను ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ మీడియాకు వెల్లడించారు. బేషరతుగా కాల్పుల విరమణను అమల్లోకి తేవాలనే తమ ప్రతిపాదనను రష్యా ఇప్పటికీ తిరస్కరిస్తోందని ఆయన తెలిపారు. ఈ అంశాలపై మరింత లోతుగా చర్చించి, ఆయా వ్యవహారాల్లో పురోగతి సాధించేందుకు జూన్ నెలాఖరులోగా మరోసారి సమావేశం కావాలని రష్యాకు ప్రతిపాదించామని రుస్తెం ఉమెరోవ్ చెప్పారు.
యుద్ధ ఖైదీల విడుదలపై అంగీకారం
సోమవారం జరిగిన శాంతిచర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. పరస్పరం యుద్ధ ఖైదీల విడుదలకు సంబంధించిన డాక్యుమెంట్లను తుర్కియే మధ్యవర్తిత్వం ద్వారా రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు మార్చుకున్నారని ఆయన తెలిపారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల్లో ఏమీ సాధించలేకపోతే, రష్యాపై వీలైనంత త్వరగా కొత్త ఆంక్షలను విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ యుద్ధంలో ఏం కోల్పోతోందో రష్యా గ్రహించాలి. కనీసం ఇప్పటికైనా దౌత్యపరమైన మార్గాల్లో చర్చలకు రావాలి అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
లిథ్వేనియా రాజధాని నగరం విల్నియస్‌లో మీడియాతో మాట్లాడుతూ జెలెన్‌స్కీ ఈ కామెంట్స్ చేశారు. నార్డిక్ దేశాలతో పాటు రష్యా సరిహద్దుల్లో ఉన్న నాటో కూటమి దేశాల్లో ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతో సమావేశమై వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఉక్రెయిన్ భూభాగం నుంచి అపహరించిన పిల్లల జాబితాను రష్యాకు ఇచ్చామని, వారిని వెంటనే విడుదల చేయాలని కోరామని జెలెన్‌స్కీ అధ్యక్ష కార్యాలయం అధిపతి ఆండ్రీ యెర్మాక్ వెల్లడించారు.
శాంతి చర్చల్లో కానరాని పురోగతి
ఇంతకుముందు మే 16న ఇస్తాంబుల్‌లోనే రష్యా, ఉక్రెయిన్ శాంతిచర్చలు జరిపాయి. ఇరుదేశాలు పరస్పరం 1000 మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈసారి చర్చల్లోనూ అదే తరహా నిర్ణయంతో సరిపెట్టడం గమనార్హం. మొత్తం మీద శాంతి చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ పెద్దగా పురోగతిని సాధించలేకపోయాయని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు.
Read Also: US: అమెరికాలో భారత్ – పాక్ దౌత్య పోటీ