జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. తీవ్రవాద దాడిని ఖండిస్తూనే దాని కారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు తమకు వీలైతే వీళ్లిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించాలని కొన్ని దేశాలు భావిస్తుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం తామేమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు.

ఇరు దేశాలు ఒక పరిష్కారంకు రావాలి..
పహల్గాం దాడిపై తాజాగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉండేవే కదా అన్నారు. ఇరు దేశాలు దీనిపై ఏదో ఒక పరిష్కారం ఆలోచించుకోవాలన్నారు. తాను భారతదేశానికి చాలా క్లోజ్ అని, అలాగే పాకిస్తాన్‌కు కూడా చాలా దగ్గరగా ఉన్నానని తెలిపారు.ఈ రెండు దేశాలూ కాశ్మీర్‌లో 1,000 సంవత్సరాలుగా ఆ పోరాటం చేస్తున్నారన్నారు.
ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్ 1,000 సంవత్సరాలుగా కొనసాగుతోందని, బహుశా దానికంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చన్నారు. తాజాగా జరిగిిన ఘటన (ఉగ్రవాద దాడి) మంచిది కాదన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారితో మాట్లాడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1,500 సంవత్సరాలుగా ఆ సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయన్నారు. దీనికి ఆయా దేశాల నాయకులే పరిష్కరించుకుంటారంటూ ట్రంప్ తప్పించుకున్నారు.
సిమ్లా ఒప్పందం
భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యల్ని ఇరుదేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం చెబుతోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సిమ్లా ఒప్పందం అమలును పాకిస్తాన్ నిలిపిసింది. అయితే కాశ్మీర్ సమస్యను సిమ్లా ఒప్పందం ప్రకారం పరిష్కరించుకోకుండా ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లి రచ్చ చేసిన చరిత్ర దాయాది దేశానికి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య వివాదంలో తలదూర్చీ ఉపయోగం లేదని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Pahalgam Attack: ఖబర్దార్ సింధు నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింప చేస్తాం: పాక్ మాజీ మంత్రి