పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన 26 మంది అమాయక ప్రజలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో తమ సహకారం ఎప్పుడూ భారత్ కు ఉంటుందని ప్రధాని మోదీకి పుతిన్ హామీ ఇచ్చారు.
భారత్- రష్యా మధ్య సంబంధాలు మరింత దృఢం
ఇలాంటి ఘటనలకు పాల్పడిన ఉగ్రమూకలను చట్టం ముందు నిలబెట్టేందుకు తమ మద్దతు భారత్ కు ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్- రష్యా మధ్య సంబంధాలు మరింత దృఢంగా మారేందుకు గల అంశాలపై పుతిన్, ప్రధాని మోదీ చర్చించారు. ఈ క్రమంలో 80వ విక్టరీ డే సందర్భంగా ప్రధాని మోదీ పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
పాకిస్థాన్ పై ప్రతీకారం
అంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. రష్యా విదేశాంగ ప్రతినిధి సర్గీ లావ్రోవ్ తో ఫోన్ లో సంభాషించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చారు. ఇక పాకిస్థాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. పలు కీలక విషయాలు చర్చించారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
Read Also: NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు