పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) జోరుగా కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా పాకిస్తాన్(Pakistan) తో కాల్పుల విరమణపై కేంద్రం ప్రకటన చేసింది. ఈ ప్రకటన దేశంలో మెజార్టీ ప్రజల్ని షాక్ కు గురి చేసింది. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న పాకిస్తాన్ పై పోరాటానికి దొరికిన మంచి అవకాశాన్ని కేంద్రం జార విడిచిందన్న చర్చ అప్పటి నుంచీ జరుగుతోంది. అయితే భారత్-పాక్(India-Pakistan) కాల్పుల విరమణపై ఇరు దేశాల కంటే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ట్వీట్ చేయడం, ఇద్దరినీ తానే ఒప్పించానని పదే పదే చెప్తుండటం, దీన్ని భారత్ ఖండిస్తుండటం జరుగుతూనే ఉన్నాయి.
గంటకు పైగా పుతిన్ ట్రంప్ సంభాషణ
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ పుతిన్ ఫోన్ కాల్ లో గంటకు పైగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి చర్చల వివరాలను ట్రంప్ స్వయంగా తన సోషల్ ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో బయటపెట్టారు. అదే సమయంలో రష్యా అధ్యక్ష నివాసం క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉష్ కోవ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో ఇరు దేశాల అధ్యక్షుడు ఉక్రెయిన్ సమస్య సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని, అందులో భారత్- పాక్ మధ్య ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న భారత్-పాక్ సీజ్ ఫైర్ కూడా ఉందని వెల్లడించారు.
భారత్-పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ వ్యక్తిగత ప్రాధాన్యం
దీంతో భారత్-పాక్ సీజ్ ఫైర్ లో ట్రంప్ జోక్యం లేదని కేంద్రం చెబుతున్న మాటలు నిజం కాదని తేలిపోయింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని అడ్డుపెట్టి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ పలు మార్లు వెల్లడించారు. ఇప్పటికీ ఆయన అదే మాట చెప్తున్నారు. అనంతరం క్రెమ్లిన్ ప్రతినిధి దీన్ని నిర్ధారిస్తూ భారత్-పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ వ్యక్తిగతంగా పాల్గొన్నట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన ఇంతవరకే వివరాలు ఇచ్చారు. ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు భారత్ ఇప్పటికే పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ ప్రతిపాదన రావడం వల్లే తాము అంగీకరించినట్లు చెబుతోంది. తాజాగా విదేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం ట్రంప్ పాత్రేమీ లేదని అమెరికాలోనే వెల్లడించారు.
Read Also: Visa: మీకు త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? డబ్బులు చెల్లించండి