ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.
యుద్ధ వాతావరణానికి దారి
ఈ పరిణామాలు కాస్తా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి కూడా. భారత్, పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్నీ పరీక్షించుకున్నాయి. ఈ పరిస్థితుల మధ్య భారత్- పాకిస్తాన్ వివాదంలో డ్రాగన్ కంట్రీ చైనా ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ ఉప ప్రధాని/విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దర్.. చైనాకు చెందిన తన కౌంటర్‌పార్ట్ వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా సాగింది టెలఫోన్ కన్వర్జేషన్. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన భద్రత వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు పాక్ మంత్రి. వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలంటూ భారత్‌లోని తమ హైకమిషనర్‌కు ఆదేశించిన విషయాన్నీ తెలిపారు.
ఏకపక్ష నిర్ణయాలు, ఆధిపత్య విధానాలు
భారత ఉపఖండంలో శాంతియుత వాతావరణం నెలకొనడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, పరస్పర అవగాహనను కలిగివుండటం వంటి అంశాలను చైనా మంత్రి వాంగ్ యీ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, ఆధిపత్య విధానాలను సంయుక్తంగా వ్యతిరేకించడానికి చైనా కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
పాకిస్తాన్-చైనాల మధ్య మిత్రత్వం
భారత ఉపఖండంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అన్ని స్థాయిల్లో పరస్పర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సమన్వయాన్ని కొనసాగించడానికి మహ్మద్ ఇషాక్ దర్, వాంగ్ యీ అంగీకరించారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. భారత్ ఏకపక్ష నిర్ణయాలు, చట్టవిరుద్ధ చర్యలు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న నిరాధారమైన ప్రచారాలను చైనా నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. పాకిస్తాన్-చైనా స్నేహానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి, ఉమ్మడి దృక్పథానికి పాకిస్తాన్- చైనా నిబద్ధతతో పని చేస్తాయని తెలిపారు. ఈ పరిణామాలు భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ప్రేరేపించాయి. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలను ప్రారంభించాయి. భారత నౌకాదళం మరియు పాకిస్తాన్ నౌకాదళం తమ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంలో మిస్సైల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.
Read Also: Pakistanis: భారత్‌ను విడిచి వెళ్లిన 537 మంది పాకిస్థానీలు