జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తమ చర్య కాదు: పాక్
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తమ చర్య కాదని నిరూపించుకునే పనిలో పడింది. తాము పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు, మిలిటెంట్ గ్రూపులే పహల్గామ్ నరమేధానికి పాల్పడ్డాయంటూ భారత్ పదే పదే చెబుతోండటాన్ని తప్పు పట్టింది.
దర్యాప్తుకు తాము సిద్ధం: ప్రధానమంత్రి షెహబాజ్
పహల్గామ్ ఉగ్రదాడిపై తటస్థ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్‌ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కకుల్‌లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బలంగా విశ్వసించదగ్గ తటస్థ దర్యాప్తు ఏజెన్సీల ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నానని షరీఫ్ వెల్లడించారు. పహల్గామ్‌లో జరిగిన విషాదకర సంఘటనను తమపై నిందలు వేయడానికి, ఆరోపణలు చేయడానికి వినియోగించుకోవడం సరైంది కాదని అన్నారు. దీన్ని బ్లేమ్ గేమ్‌గా అభివర్ణించారు. ఇప్పుడిదే విషయాన్ని తాజాగా అమెరికా ప్రస్తావించింది. ఫహల్గామ్ ఉగ్రవాద దాడిపై చేపట్టిన దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని పాకిస్తాన్‌కు సూచించింది. పహల్గామ్ దాడి ఘటనపై తటస్థ ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి కట్టుబడి ఉండాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
ఏ రూపంలో ఉన్నా సహించకూడదు: జేడీ వాన్స్
గురువారం ఫాక్స్ న్యూస్ నిర్వహించిన స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్ షోలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పారు. తమ దేశ భూభాగంపై కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఉగ్రవాదులను వేటాడాలని సూచించారు. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్.. భారత్‌కు సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ? ఏ మూలన? ఏ రూపంలో ఉన్నా సహించకూడదని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. గతంలో న్యూయార్క్ ట్విన్స్ టవర్స్‌పై అల్ ఖైదా దాడి తరువాత అమెరికా ఏ రకంగా దాన్ని మట్టుబెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదం ప్రపంచ దేశాల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.
Read Also: Trump Warning : ఆ దేశాలకు ట్రంప్ వార్నింగ్