పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఇరుదేశాల గగనతలాల్ని ప్రత్యర్థి విమానాలు వెళ్లకుండా ఇప్పటికే మూసేశారు. అలాగే ఇరు దేశాలూ ప్రత్యర్థి దేశాల పౌరుల్ని వారి స్వదేశాలకు బహిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్‌లోని అట్టారీ మీదుగా వాఘా సరిహద్దు పోస్టు వద్ద గేట్లను మూసేశారు.
చిక్కుకుపోయిన ఇరుదేశాల పౌరులు
పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వెళ్లాలనుకునే వారు, అలాగే భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లే వారు ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దుశ్చర్యతో ఇరుదేశాల పౌరులూ ఇక్కడ చిక్కుకుపోయారు. పాకిస్తాన్ జాతీయులను సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదని భారత అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆప్ఘన్ ట్రక్కుల్ని మాత్రం భారత్ లోకి వెళ్లందుకు పాకిస్తాన్ అనుమతిస్తోంది.
పెరిగిన ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన
వాస్తవానికి భారత్ లో ఉన్న తమ పౌరుల్ని పాకిస్తాన్ ఏప్రిల్ 29 వరకూ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో నిన్నటి వరకూ వేచి చూసిన పాకిస్తాన్.. ఇక అట్టారీ-వాఘా గేట్ ను మూసేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన మరింత పెరిగినట్లయింది. పాకిస్తాన్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరుదేశాలకు చెందిన పౌరులు ఇక్కడ చిక్కుకుపోయారు.
గడువును పొడిగించిన భారత్
భారత్ తాజాగా పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. వివిధ కారణాలతో భారత్ లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ పౌరుల్ని తమ తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ ఇక్కడే ఉండేందుకు అనుమతించింది. దీంతో ఎమర్జెన్సీ కారణాలతో భారత్ లో చిక్కుకున్న వారికి వెసులుబాటు దక్కింది. వీరు కాకుండా మిగిలిన వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోయేందుకు మాత్రం ఇప్పుడు ఆటంకాలు తప్పడం లేదు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌పై యూఎస్ అత్యాశ