పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defence Minister khawaja asif) తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని ఉద్దేశిస్తూ ఖవాజా ఆసిఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోనే తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇలాంటి భాష వాడితే భారత్(India)తో చర్చలు ఎలా ముందుకు వెళ్తాయని పాకిస్తాన్(Pakistan)కు చెందిన మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఆసిఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో భారత్ గురించి చైనా ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకుందని ఆయన అంగీకరించడం తీవ్ర సంచలనంగా మారింది.
తమకు చైనా సహకరించింది: ఖవాజా ఆసిఫ్
ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు చైనా సహకరించిందంటూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్.. స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు, వైమానిక మార్గాలు, ఆపరేషన్ వంటి అంశాలపై చైనాకు భారత్‌తో సమస్యలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత..
భారత్‌తో చైనాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని.. పాక్‌తో ఇంటెలిజెన్స్ పంచుకోవడం చాలా సాధారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సర్వసాధారణమేనని ఆయన సమర్థించుకోవడం తీవ్ర విమర్శలకు అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పాకిస్తాన్ తమ సరిహద్దులను అప్రమత్తంగా ఉంచుకుందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర విమర్శలు
ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని.. అంతర్జాతీయ సమాజానికి బట్టబయలు చేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆయన ఒప్పుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత భారత్ చేసిన దాడుల గురించి పాక్ నేషనల్ అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేస్తూ దొరికిపోయిన ఖవాజా ఆసిఫ్.. సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.