రష్యాలోని కమ్చత్కా ద్వీపకల్పం (Kamchatka Peninsula in Russia) ఇటీవల వరుస భూకంపాలతో వణుకుతోంది. కొన్ని రోజుల క్రితం సంభవించిన 8.7 తీవ్రత గల భారీ భూకంపం సునామీ (Massive earthquake tsunami) భయాలను రేకెత్తించింది. ఆ ఘటన మరవక ముందే శనివారం మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ఘటనలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.జూలై 30న కమ్చత్కా తీరంలో శక్తివంతమైన భూకంపం చోటుచేసుకుంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. మొదట దీన్ని 8.0గా అంచనా వేసినప్పటికీ, తాజా సమాచారం ఆధారంగా తీవ్రతను 8.7కు సవరించారు.భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చత్స్కీ నగరానికి ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 19.3 కిలోమీటర్ల లోతున ఉందని గుర్తించారు.

సునామీ హెచ్చరికలతో అప్రమత్తత
ఈ భారీ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా, జపాన్ తీర ప్రాంతాలను మూడు గంటల్లో అలలు తాకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ యంత్రాంగం తీర ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలంటూ సూచనలు ఇచ్చింది. భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఫర్నిచర్ స్వయంగా కదిలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో భవనాలు, మౌలిక వసతులకు నష్టం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
మరోసారి భూమి కంపింది
ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే, ఆగస్టు 2న ఉదయం 11:06 గంటలకు అదే ప్రాంతంలో మరొక భూకంపం సంభవించింది. జర్మనీకి చెందిన జీఎఫ్జెడ్ జియోసైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొన్నారు.ప్రపంచంలో అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో ఒకటైన ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో కమ్చత్కా ఉండటం వల్లే ఈ వరుస భూకంపాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్