వికెట్లు పడగొట్టడంపై టీమిండియా స్టార్ పేసర్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో 6 వికెట్లు పడగొట్టడంపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రదర్శన తనకు చాలా ప్రత్యేకమని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఐదు వికెట్ల ఘనత దక్కిందన్నాడు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంతోనే 6 వికెట్లు దక్కాయని తెలిపాడు. తనకు బాధ్యత తీసుకోవడమన్నా ఛాలెంజ్ స్వీకరించడమన్నా చాలా ఇష్టమని తెలిపాడు. మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (6/70) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరే 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు.
మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు
సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్(4/88) నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో భారత్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్(22 బంతుల్లో 6 ఫోర్లతో 28) ఔటవ్వగా కరుణ్ నాయర్ (Karun Nair) (7 బ్యాటింగ్)తో కలిసి కేఎల్ రాహుల్(28 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.మూడో రోజు ఆట అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన సిరాజ్ ఈ వికెట్‌పై ఓపికగా ఉండటం చాలా అవసరమని తెలిపాడు. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేయడమే తమ ప్రణాళిక అని చెప్పాడు. ‘ఈ 6 వికెట్ల ప్రదర్శన అసాధారణం.
ప్రదర్శన నాకు చాలా ప్రత్యేకమైనది
ఎందుకంటే ఈ తరహా ప్రదర్శన కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. బాగా బౌలింగ్ చేసినా నాకు వికెట్లు దక్కలేదు. ఇంగ్లండ్ (England) గడ్డపై నాకు నాలుగు వికెట్ల ఘనతలు మాత్రమే ఉన్నాయి. దాంతోనే ఈ 6 వికెట్ల ప్రదర్శన నాకు చాలా ప్రత్యేకమైనది.వికెట్ చాలా స్లోగా ఉంది. కానీ పేస్ అటాక్‌ను లీడ్ చేస్తున్నప్పుడు నిలకడగా సరైన ప్రాంతంలో క్రమశిక్షణతో బౌలింగ్ చేయడం ముఖ్యం. దాంతోనే నేను ఎక్కువగా ప్రయత్నించలేదు. బుమ్రా లేకపోవడంతో పరుగులివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలనుకున్నాను. ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణకు ఇది నాలుగో మ్యాచ్ మాత్రమే.
ఈ పిచ్‌పై ఓపికగా ఉండటం చాలా ముఖ్యం
దాంతో నేను నిలకడగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంపై ఫోకస్ పెట్టాను. వైవిధ్యంగా బౌలింగ్ చేయాలనిపించినా నిలకడగా బౌలింగ్ (Bowling) చేయడానికే ప్రయత్నించాను. బుమ్రా లేనప్పుడు నా గణంకాలు మెరుగ్గా ఉన్నాయి. నాకు బాధ్యత, ఛాలెంజ్ అంటే ఇష్టం.ఈ మ్యాచ్‌లో మేం చాలా ముందున్నాం. కానీ ఇంగ్లండ్ అటాకింగ్ మైండ్‌సెట్ మాకు తెలుసు. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే మా లక్ష్యం. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుంది. ఒకే ప్రాంతంలో బౌలింగ్ చేస్తే పరుగులు వస్తున్నాయి. బ్యాటర్లను ఆపడం కష్టంగా మారింది. స్మిత్, బ్రూక్ ఆడే సమయంలో మాకు ఈ విషయం అర్థమైంది. ఈ పిచ్‌పై ఓపికగా ఉండటం చాలా ముఖ్యం.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohammed Shami: షమీ ఓ క్రిమినల్..అతడిపైన పోరాటం ఆగదు: హసీన్ జహాన్