శతకంతో
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా మార్క్‌రమ్ (Markrum) నిలిచాడు. అంతేకాకుండా ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో సౌతాఫ్రికా తరఫున సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా కూడా రికార్డ్ అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో మార్క్‌రమ్(159 బంతుల్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) శతకంతో చెలరేగారు. ఈ సెంచరీతో పలు రికార్డ్స్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో సెంచరీ సాధించిన మూడో బ్యాటర్ మార్క్‌రమ్ కాగా అతని కన్నా ముందు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఈ ఫీట్ సాధించారు. భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మీత్(121) సెంచరీలు అందుకున్నారు. అయితే ఈ ఇద్దరూ తొలి ఇన్నింగ్స్‌లోనే ఫీట్ సాధించారు. కానీ మార్క్‌రమ్ నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం అందుకోవడం విశేషం.
లార్డ్స్ వేదికగా
మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన మార్క్‌రమ్, రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించడం ద్వారా మరో ఘనతను అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్‌లో డకౌట్ అవ్వడంతో పాటు సెంచరీ బాదిన 9వ బ్యాటర్‌గా మార్క్‌రమ్ నిలిచాడు. 1980 తర్వాత లార్డ్స్‌లో ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. మార్క్‌రమ్ కంటే ముందు 2002లో మైకేల్ వాన్ (Michael Van) భారత్‌తో జరిగిన టెస్ట్‌లో ఈ ఫీట్ సాధించగా 2016లో పాకిస్థాన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఈ ఘనతను అందుకున్నాడు.ఓ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గానూ మార్క్‌రమ్ గుర్తింపు పొందాడు.
అత్యధిక సెంచరీ
అతని కన్నాముందు బ్రూస్ మిచెల్, గ్రేమ్ పొలాక్, జాక్వస్ కల్లీస్ ఈ ఫీట్ సాధించారు. లార్డ్స్‌లో ఐసీసీ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో ఆటగాడు: వెస్టిండీస్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్ తర్వాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఐసీసీ ఫైనల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా మార్క్‌రమ్ నిలిచాడు. ఈ క్రమంలో అతను ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ను అధిగమించాడు. మార్క్‌రమ్ నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు చేయగా డివిలియర్స్ 2 సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సునీల్ గవాస్కర్, గ్రేమ్ స్మిత్‌లు ఉన్నారు. ఈ ఇద్దరు నాలుగు శతకాలు నమోదు చేశారు.
రెండో ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా గెలుపు ముంగిట నిలిచింది. 282 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా (South Africa) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్‌రమ్‌కు తోడుగా కెప్టెన్ టెంబా బవుమా(121 బంతుల్లో 5 ఫోర్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సౌతాఫ్రికా విజయానికి 69 పరుగుల అవసరం కాగా ఆస్ట్రేలియాకు 8 వికెట్లు కావాలి. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.