ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీని మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు బహుమతిగా ఇచ్చారు. మోహన్‌లాల్ ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నందుకు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.జీవితంలోని కొన్ని క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ రోజు, అలాంటి ఒక క్షణం నేను అనుభవించాను. ఈ బహుమతిని నేను నెమ్మదిగా విప్పుతున్నప్పుడు, నా గుండె వేగంగా కొట్టుకుంది. – ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ స్వయంగా సంతకం చేసిన జెర్సీ. దానిపై నా పేరు అతని చేతితో రాయబడి ఉంది. మెస్సీని అతని ఆటతీరుకే కాకుండా, అతని నిరాడంబరత, వినయానికి కూడా అభిమానించే నాకు ఇది నిజంగా ప్రత్యేకమైనది. నా ప్రియమైన స్నేహితులు డాక్టర్ రాజీవ్ మంగోట్టిల్, రాజేష్ ఫిలిప్ సాయం లేకుండా ఈ అద్భుతమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికీ మించి, ఈ మరపురాని బహుమతికి దేవుడికి ధన్యవాదాలు,” అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
బహుమతి
ఈ జెర్సీని మోహన్‌లాల్‌కు అతని స్నేహితులు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్న ‘హృదయపూర్వం’ సినిమా సెట్‌లో అందజేశారు. ఈ ఊహించని బహుమతి మోహన్‌లాల్‌తో పాటు సత్యన్ అంతికాడ్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. అభిమానులు, సహచర నటీనటులు శ్రేయోభిలాషులు మోహన్‌లాల్ పోస్ట్‌పై అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఎంపురాన్
ప్రస్తుతం మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా మలయాళ చిత్రం “తుడరుమ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ జీవా’ ఫేం దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా, ఎం. రెంజిత్ ‘రెజపుత్ర విజువల్ మీడియా’ పతాకంపై నిర్మిస్తున్నారు.ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది.