ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్(Wallmart) తాజాగా చేపట్టిన ఉద్యోగాల కోత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను, ముఖ్యంగా టెక్నాలజీ విభాగానికి చెందిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం హెచ్-1బీ వీసా(H1-Visa)లపై కొత్త వివాదానికి దారితీయడంతో పాటు, సంస్థ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సురేష్ కుమార్(Suresh Kumar) పై విమర్శలకు కారణమైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తమ కార్యకలాపాలను తీర్చిదిద్దుకోవాలని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా
ఈ లేఆఫ్‌ల ప్రకటన వెలువడిన తర్వాత, వాల్‌మార్ట్ సీటీఓ సురేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఉద్యోగాల కోతకు, కంపెనీ హెచ్-1బీ వీసాలపై విదేశీయులను నియమించుకునే విధానానికి మధ్య సంబంధం ఉందని ఆ పోస్టులో ఆరోపించారు. వాల్‌మార్ట్ ఐటీ విభాగంలో 40 శాతానికి పైగా భారతదేశానికి చెందిన హెచ్-1బీ వీసా హోల్డర్లు ఉండటం యాదృచ్ఛికం కాదని సదరు పోస్టులో పేర్కొన్నారు.
హెచ్-1బీ వీసా కార్యక్రమంపై మరోసారి చర్చ
ఈ తాజా ఆరోపణలతో అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అక్కడి కంపెనీలకు అనుమతించే హెచ్-1బీ వీసా కార్యక్రమంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కార్యక్రమం వల్ల అమెరికన్ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని కొందరు విమర్శిస్తుండగా, కీలక నైపుణ్యాల కొరతను తీర్చడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు.
ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ..
ఈ పరిణామాలపై వాల్‌మార్ట్ స్పందించింది. బ్లూమ్‌బెర్గ్ సమీక్షించిన ఒక మెమోలో, సీటీఓ సురేష్ కుమార్, వాల్‌మార్ట్ యూఎస్ సీఈఓ జాన్ ఫర్నర్ మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి, సంస్థాగత నిర్మాణాన్ని సులభతరం చేయడానికి ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత తప్ప, హెచ్-1బీ వీసాలపై నియామకాలకు దీనికి ప్రత్యక్ష సంబంధం లేదని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది.
సురేష్ కుమార్ ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థి. ఆయన గతంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీలలో కీలక నాయకత్వ పదవులు నిర్వహించారు. 2019లో వాల్‌మార్ట్‌లో చేరిన సురేష్ కుమార్, ప్రస్తుతం సంస్థ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రిటైల్ పరిష్కారాలు ఆయన పరిధిలోకి వస్తాయి.
Read Also: Gaza: ఇజ్రాయెల్ దాడిలో పిల్లలను కోల్పోయిన ఓ వైద్యుడి దీన గాథ..