తమ దేశంపై దాడులు చేసినందుకు ఇజ్రాయెల్(Israel) కఠినమైన శిక్ష ఎదుర్కొంటుందని ఇరాన్(Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(Ayatulla ali Khameni) తెలిపారు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇరాన్‌లోని నివాస కేంద్రాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసిందని మండిపడ్డారు. ఇజ్రాయెల్ తన దుష్ట, రక్తపు మరకలు పడిన చేతిని ఇరాన్‌పై తెరిచిందని ఆరోపించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇరాన్ సైనిక, అణు స్థావరాలే ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అయతుల్లా అలీ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ధ్వంసమైన ఇరాన్ అణుశుద్ధి కేంద్రం
ఇరాన్‌లోని నతాంజ్ లోని యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) శుక్రవారం ధ్రువీకరించింది. “ఐఏఈఏ ఇరాన్లో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. రేడియేషన్ స్థాయిలకు సంబంధించి ఏజెన్సీ ఇరాన్ అధికారులతో సంప్రదిస్తోంది. దేశంలోని మా ఇన్ స్పెక్టర్లతో కూడా మేం మాట్లాడుతున్నాం” అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి రాఫెల్ మారియానో గ్రాస్సి ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్’
ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ను చేపట్టింది ఇజ్రాయెల్. ఈ క్రమంలో ఇరాన్ లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. దీంతో ఇరాన్ ప్రధాన అణు కేంద్రం సహా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ నల్లటి పొగ గాలిలోకి ఎగసిపడటం ఫొటోలు, వీడియోలలో కనిపిస్తోంది. కాగా, 1980లో ఇరాక్ తో యుద్ధం తర్వాత ఇరాన్ ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన దాడి ఇదే. ఈ దాడులు రెండు భీకర పశ్చిమాసియా దేశాల ప్రత్యర్థుల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి.
అమెరికా ఏమందంటే?
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఏకపక్ష చర్య తీసుకుందని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం దాడులు అవసరమని నమ్ముతున్నట్లు అమెరికాకు సూచించిందని వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమకేమి సంబంధం లేదని స్పష్టం చేసింది. టెహ్రాన్ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించింది. తమ దేశ బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ప్రకటన విడుదల చేశారు.
Read Also: Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!