ఇరాన్, ఇజ్రాయేల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధరంగాన్ని తలపించే స్థాయికి చేరాయి.ఇరాన్, ఇజ్రాయేల్ ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఈ భీకరదాడుల్లో ఇరాన్ (Iran) కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను కోల్పోయింది. అలానే ఇరాన్ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందన్నారు. ఈ సందర్బంగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేయడమేకాక,ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నారు ట్రంప్.ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని సమర్థించారు. పైగా ఇజ్రాయెల్ చేసిన దాడి అద్భుతమంటూ ప్రశంసించారు. అంతేకాక ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israyel) దాడులని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రంప్ హెచ్చరికలు
అంతేకాక ఇరు దేశాల దాడులతో నష్టం తప్ప లాభం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మించి పోయిందేంలేదని,ఇకనైనా ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ సూచించారు.తీవ్ర నష్టం వాటిల్లక ముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. అంతేకాక న్యూక్లియర్ డీల్ (Nuclear deal) కోసం ఇరాన్‌కు ఇప్పటికే 60 రోజుల సమయం ఇచ్చామని, ఇవాళ 61వ రోజు కూడా వచ్చిందన్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని ఇప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయాలని లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదన్న ట్రంప్ ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే మాత్రం దాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా ఆర్మీలోని సెంట్రల్ కమాండ్ రెడీగా ఉందని తేల్చి చెప్పారు.
ఎలాంటి సంబంధం
అమెరికా తనను తాను కాపాడుకోవడమే కాక అవసరం అయితే ఇజ్రాయెల్‌ను కూడా కాపాడుతుందని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ ఇలా మాట్లాడుతుంటే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) మాత్రం ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని మార్కో రూబియో తెలిపారు. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడంపైనే తమ దృష్టి ఉందన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయకూడదని, అలానే తమ సిబ్బందిపై దాడులు చేయరాదని ఇప్పటికే ఇరాన్‌కు స్పష్టం చేశామన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇరాన్ తమపై ఇజ్రాయెల్ దాడి చేస్తే, అందుకు అమెరికాదే బాధ్యత అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఈక్రమంలోనే రూబియో పై విధంగా స్పందించారు.
Read Also: Iran-Israel Conflict : పరస్పర దాడులతో భగ్గుమన్న పశ్చిమాసియా!