మయన్మార్‌లో భూకంపం సంభవించింది.భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది.
టెక్టానిక్ ప్లేట్లు
భూకంపాలు ప్రధానంగా భూమి లోపల తేలియాడే టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవిస్తాయి. భూగోళాన్ని పరిశీలిస్తే, లోపలి నుంచి పొరలుగా విభజించబడింది. భూమి అంతర్గతంగా కోర్, మ్యాంటిల్, క్రస్ట్ అనే మూడు ప్రధాన పొరలుగా ఉంటుంది. ఈ క్రస్ట్ టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడి, మాంటిల్‌పై తేలియాడుతూ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొట్టడం, దూరంగా జరగడం లేదా ఒకటి మరొకటి కిందకి దిగడం వంటివి భూకంపాలకు కారణమవుతాయి.భారత ఉపఖండం టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్‌ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ కదలిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడంతో హిమాలయాల ఎత్తు ప్రతి సంవత్సరం సుమారు 8 సెం.మీ పెరుగుతోంది. అలాగే, ఈ టెక్టానిక్ కదలికల వల్లే హిమాలయ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
యురేషియన్ ప్లేట్
భూకంపాల ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు “ఫాల్ట్ లైన్స్” అనే సంభావ్య భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మయన్మార్‌పై ఉన్న సగైంగ్ ఫాల్ట్. ఇది ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దుగా ఉంది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి అడ్డంగా జారిపోవడం వల్ల “స్ట్రైక్-స్లిప్” భూకంపాలు సంభవిస్తాయి.

100 ఏళ్లలో
మార్చి 28, 2025న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ఉపరితలంపై తీవ్ర ప్రభావం చూపించింది. బ్యాంకాక్ వరకు ఈ భూకంప ప్రభావం కనిపించింది. గత 100 ఏళ్లలో ఈ రేంజ్‌లో ఇంతటి భారీ భూకంపాలు చాలా అరుదుగా సంభవించాయి.భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌లోనూ తీవ్రంగా ఉంది. కొన్ని నగరాల్లో భవనాలు బీటలవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.మయన్మార్, థాయ్‌లాండ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది.
భవిష్యత్తులో సంభవించే
భూకంపాలను ముందుగా అంచనా వేసే పరిజ్ఞానం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అయితే, శాస్త్రవేత్తలు టెక్టానిక్ ప్లేట్ల కదలికలపై పరిశోధనలు చేస్తూ భవిష్యత్తులో సంభవించే భూకంపాలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.